Wednesday, March 3, 2010

ఆలోచింపచేసే 'దగ్ధ దృశ్యం'

ఆదివారం అనుబంధం, ప్రజాశక్తి Sun, 28th Feb

డా||శిఖామణి, బి.హనుమారెడ్డి గార్లు ఈ గ్రంథానికి ముందు మాటలు రాశారు. కవి ఈ కవితా సంపుటిని వారి జీవన సహచరి 'లీనా'కు, కుమారుడు ప్రత్యూష యశస్వి, కుమార్తె స్వప్నికా రాజ్ఞిలకు అంకితం చేశారు. ఒరిస్సాలోని క్రైస్తవ మత బోధకుడు గ్రాహెమ్‌స్టెయిన్‌ దహనకాండ నుండి ఒరిస్సాలోని కాంద్‌మాల్‌ క్రైస్తవ సన్యాసులపై జరిగిన అత్యాచారం, మరణకాండ వరకు జరిగిన, జరుగుతున్న ఘోరాన్ని క్రైస్తవులు మౌనం వీడి మాట్లాడవలసిన అవసరాన్ని ఈ 'దగ్ధదృశ్యం' చెపుతోంది అని డా||శిఖామణి పేర్కొన్నారు ముందుమాటలో...

పట్టణీకరణ/నగరీకరణ వేస్తున్న వెర్రితలలు, సమాజం చెందుతున్న తీవ్రపరిణామం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అంటారు బి.హనుమారెడ్డి. దాదాపు అన్ని కవితలూ.. ఆలోచింపజేస్తాయి.

'బహిరంగ స్నేహితుడు' కవిత (పేజీ21)లో కవి ఇలా అంటాడు.

పోస్ట్‌ మోడర్న్‌ కోటు కింద / మూఢత్వాల జోలె దాస్తూ వుండు / పైపై సంఘీభావాలు ప్రకటిస్తూ / 'పజిల్‌'గా మిగిలిపోతూ వుండు / కవిగోష్ఠుల్లో విప్లవాలు పండిస్తూ / కమండల తీర్థంలో ఈదులాడుతూ వుండు. 'దగ్ధదృశ్యం' (పేజీ 28) కవితలో కవి తన భావజాలాన్ని స్పష్టపరిచిన తీరు ప్రశంసనీయం

''మేధావుల్ని, మహనీయుల్ని మరుగుచేస్తూ

మీడియా కావలసినంత మురికిని

ముఖాలమీదికి చిమ్ముతోంది'' అంటారు.

'గ్రద్దలు క్షేమం' (పేజీ36) కవిత కూడా చాలా ప్రశంసనీయంగా వుంది.

''చుండూరు కావచ్చు / ముదిగొండ కావచ్చు / వాకపల్లి కావచ్చు / కడకు భైర్లాంజీ కావచ్చు / ఏవూరైతేనేం?

అంతా భద్రంగానే వుంటారు / ఆదివాసీ ఊరపిచ్చుకలు / మైనారిటీ మైనాలు/

బలహీన విహంగాలు / నోరు తెరిచే దళిత కపోతాలు తప్ప

గద్దలెప్పుడూ క్షేమంగానే వుంటాయి- ఎరమీద కన్నేసి''

109 పేజీల్లో రాసిన 52 కవితలు.... పాఠకుల్ని చదివిస్తాయి. ఆలోచింపచేస్తాయి.

గాయం కొత్తదేమీ కాదు/ వానకోయిల ఏడ్పు పాట / సముద్ర గాయం/ మౌనభంగం/ కామోన్మాదం/ బర్రెమాత / విముక్తిగీతం/ తాజ్‌మహల్‌ / పవిత్ర దుఃఖం'' కవితలు సంక్షోభ సందర్భంలోంచి వెలువడ్డాయి... అనిపిస్తుంది. వర్ణ వ్యవస్థ సాగిన ఈ అక్షర సమరం వాస్తవిక దృశ్యమే. కవి మరింత పదునైన భాష భావావేశంతో నిబద్ధతతో మరిన్ని మంచి కవితలు రాయాలి.

దగ్ధ దృశ్యం (క)

(కవితా సంపుటి)

కొండెపోగు బి.డేవిడ్‌ లివింగ్‌స్టన్‌

పేజీలు : 110, వెల : 60/-,

ప్రతులకు :డా|| కొండెపోగు డేవిడ్‌ లివింగ్‌స్టన్‌

అరుణోదయ స్కూల్‌ ఎదుట,

తర్లుపాడు రోడ్‌, మార్కాపురం - 523316.

ప్రకాశం జిల్లా. సెల్‌ : 9440211120.

- టి.సి

No comments:

Post a Comment